ట్రంప్ కార్యక్రమం వద్ద కాల్పులు.. ఖండించిన ప్రధాని మోదీ

  • అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కార్యక్రమం వద్ద కాల్పుల కలకలం
  • క్షేమంగా బయటపడిన ట్రంప్.. ఆయన కుటుంబ సభ్యులు
  • ఘటనను తీవ్రంగా ఖండించిన భారత ప్రధాని నరేంద్ర మోదీ
  • ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదంటూ మోదీ వ్యాఖ్య
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హాజరైన ఒక కార్యక్రమం వద్ద కాల్పుల ఘటన చోటుచేసుకోవడంపై భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఈ ఘటనను ఖండిస్తూ, ప్రజాస్వామ్యంలో హింసకు స్థానం లేదని స్పష్టం చేశారు. అధ్యక్షుడు ట్రంప్, ఆయన కుటుంబ సభ్యులు క్షేమంగా ఉన్నారన్న వార్త తనకు ఉపశమనం కలిగించిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

వాషింగ్టన్ డీసీలోని హిల్టన్ హోటల్‌లో శనివారం రాత్రి వైట్ హౌస్ కరస్పాండెంట్స్ అసోసియేషన్ వార్షిక విందు జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షుడు ట్రంప్, ప్రథమ మహిళ మెలానియా ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఇతర కీలక ఉన్నతాధికారులు హాజరయ్యారు. అదే సమయంలో హోటల్ వద్ద తుపాకీ కాల్పుల శబ్దాలు వినిపించడంతో తీవ్ర కలకలం రేగింది. భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమై ట్రంప్ దంపతులతో పాటు ఉన్నతాధికారులను అక్కడి నుంచి సురక్షిత ప్రాంతానికి తరలించారు. అనంతరం విందును రద్దు చేశారు. 

ఈ ఘటనపై ప్రధాని మోదీ 'ఎక్స్' (ట్విట్ట‌ర్) వేదికగా స్పందించారు. "అధ్యక్షుడు ట్రంప్, ప్రథమ మహిళ, ఉపాధ్యక్షుడు క్షేమంగా, ఎలాంటి హాని జరగకుండా బయటపడ్డారని తెలిసి ఊరట చెందాను. వారి భద్రత, శ్రేయస్సు కోసం నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రజాస్వామ్యంలో హింసకు చోటు లేదు. దానిని నిస్సందేహంగా ఖండించాలి" అని పోస్ట్ చేశారు.

అటు ఈ ఘటనపై వైట్ హౌస్‌లో ట్రంప్ మీడియాతో మాట్లాడారు. పలు ఆయుధాలు ధరించిన ఓ వ్యక్తి సెక్యూరిటీ చెక్‌పాయింట్ వైపు దూసుకొచ్చాడని తెలిపారు. సీక్రెట్ సర్వీస్ సభ్యులు అతడిని అడ్డుకున్నారని చెప్పారు. ఆ దుండగుడు ఒక సీక్రెట్ సర్వీస్ ఏజెంట్‌పై కాల్పులు జరిపాడని, అయితే బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్‌ ధరించడం వల్ల అతను సురక్షితంగా ఉన్నాడని వివరించారు. ఆ ఏజెంట్ ప్రస్తుతం మంచి ఆరోగ్యంతో ఉన్నారని ట్రంప్ పేర్కొన్నారు.

దాదాపు 50 గజాల దూరం నుంచి ఆ వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చాడని ట్రంప్ తెలిపారు. నిందితుడిని 'మతిస్థిమితం లేని వ్యక్తిగా పేర్కొన్నారు. అధికారులు అతడిని 'లోన్ వుల్ఫ్' (ఒంటరిగా దాడి చేసేవాడు)గా భావిస్తున్నారని, ఈ దాడికి ఒక్కడే పాల్పడ్డాడని చెప్పారు. ప్రస్తుతం నిందితుడు అదుపులో ఉన్నాడు.

Donald Trump
Trump shooting
Narendra Modi
White House Correspondents Association
Washington DC
Gun violence
US President
Security breach
Secret Service
Political violence

More Telugu News